భగవన్-నిర్గుణ మానస పూజా ( శ్రీ శంకరాచార్య కృతమ్ )
1 అఖణ్డే సచ్చిదానన్దే నిర్వికల్పైకరూపిణి |
స్థితే2ద్వితీయ-భావే2పి కథం పూజా విధీయతే ||
అఖండమూ, నిర్గుణమూ అయిన సచ్చిదానంద స్వరూపుడూ అయిన
పరమాత్మకు పూజ ఏవిధంగా చేయగలము?!
2 పూర్ణస్యావాహనం కుత్ర సర్వాధారస్య చాసనమ్ |
స్వచ్ఛస్య పాద్య మర్ఘ్యం చ శుద్ధస్యాచమనం కుతః ||
౧ ఆవాహనం : పరిపూర్ణుడైన ( అంతటా నిండియున్న ) స్వామిని
ఎక్కడినుంచి ఎక్కడికి ఆహ్వానించగలము ?!
౨ ఆసనం : సర్వమునకు తానే ఆధారముగా ఉంటున్న స్వామికి
ఆధారముగా ఏ ఆసనమును సమర్పించగలము ?!
౩,౪ పాద్యం, అర్ఘ్యం : నిత్య స్వచ్ఛుడు అయిన స్వామియొక్క పాదపద్మములను,
కరకమలములను శుద్ధిచేయగల ఉదకము లున్నవా ?!
౫ ఆచమనం : నిత్య పరిశుద్ధుడు, సర్వపావనుడు అయిన స్వామికి
ఆచమనం ఎందులకు ?!
3 నిర్మలస్య కుతః స్నానం వాసో విశ్వోదరస్య చ |
అగోత్రస్య త్వవర్ణస్య కుత స్తస్యోపవీతకమ్ ||
౬ స్నానం : మాలిన్యమే లేని నిర్మలునకు స్నానం వల్ల ప్రయోజనం ఉందా ?!
౭ వస్త్రం : విశ్వమంతటినీ తన ఉదరంలోనే దాచుకున్న స్వామికి,
ఆయన దేహాన్ని కప్పగల వస్త్రం ఏమివ్వగలము ?!
౮ యజ్ఞోపవీతం : స్వయముగా ఏ గోత్రము, ఏ వర్ణమూ లేనట్టిన్నీ,
అన్ని గోత్రములకూ, అన్ని వర్ణములకూ మూలమైనట్టిన్నీ,
అనుపనీతుడైనట్టిన్నీ స్వామికి
యజ్ఞోపవీతము ఏమని సమర్పించగలము ?!
4 నిర్లేపస్య కుతో గన్ధః పుష్పం నిర్వాసనస్య చ |
నిర్విశేషస్య కా భూషా కో2లఙ్కారో నిరాకృతేః ||
౯ గంథం : కర్మాకర్మలూ, పాపపుణ్యాలూ ఏవీ అంటని స్వామికి
గంథం పూయటం ఎందులకు ?!
౧౦ పుష్పం : ఏ వాసనలూ లేని, అంటని, వాసనారహితుడైన స్వామికి -
ఆత్మ-చైతన్య ప్రకాశం కలిగిన సువాసనా-యుతమైన
మనఃపుష్పాన్ని సమర్పించాలిగాని -
ప్రకృతిలోని పుష్పముల సమర్పణ ఎందులకు ?!
ఆభరణాని : ఆకాశం వలె సర్వవ్యాపకంగా ఉంటూ, అవయవములు లేనట్టి
స్వామికి ఆభరణాలు ఎక్కడ ధరింప జేయగలము ?!
అలంకారం : నిరాకారుడైన స్వామికి ఏమి అలంకారం చేయగలం ?!
5 నిరఞ్జనస్య కిం ధూపై ర్దీపైర్వా సర్వసాక్షిణః |
నిజానన్దైక-తృప్తస్య నైవేద్యం కిం భవేదిహ ||
౧౧ ధూపం : నిరంజనుడైన స్వామికి ధూపము లెందులకు ?!
౧౨ దీపం : సర్వసాక్షియై, సర్వ దృశ్యములకూ దృక్ స్వరూపుడైనట్టి
స్వామికి దీపదర్శనము వలన ఏం ప్రయోజనం ?!
౧౩ నైవేద్యం : అఖండ – ఆత్మానందము ననుభవిస్తూ తృప్తుడైన స్వామికి
నైవేద్యముగా ఏమి ఇవ్వగలము ?!
6 విశ్వానన్దయితు స్తస్య కిం తాంబూలం ప్రకల్పతే |
స్వయంప్రకాశ-చిద్రూపో యో2సావర్కాది-భాసకః ||
7 గీయతే శ్రుతిభి స్తస్య నీరాజనవిధిః కుతః |
ప్రదక్షిణ మనన్తస్య ప్రణామో2ద్వయ వస్తునః ||
౧౪ తాంబూలం : విశ్వాన్ని అంతటినీ ఆనందమయము చేసే స్వామికి
ఆనందకరంగా ఉండే తాంబూలం ఏమివ్వగలం ?!
౧౫ నీరాజనం : వేదములు ఎవరినైతే, ” చిద్రూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు,
సూర్య చంద్రాగ్ని గ్రహ నక్షత్రాదులను భాసింప జేస్తున్నాడు “
అని కీర్తిస్తూన్నాయో, అట్టి స్వామికి ఏమి హారతులివ్వ గలము ?!
ప్రదక్షిణం : దిక్కులు అన్నీ కూడా ఎవరిలోనే లయిస్తూన్నాయో, అట్టి
అనంతుడైన స్వామికి ప్రదక్షిణములు సాధ్యమా ?!
నమస్కారం : సర్వమూ తానేయైన వానికి, రెండవ వస్తువే లేని అద్వితీయుడైన
స్వామికి నమస్కారము చేయగలవారు ఎవరు ?!
8 వేదవాచా మవేద్యస్య కిం వా స్తోత్రం విధీయతే |
అన్తర్బహిః సంస్థితస్య ఉద్వాసనవిధిః కుతః ||
౧౬ మంత్రపుష్పం ( స్తోత్రం ) : అన్నిటినీ తెలుసుకునేవాడే గానీ, దేనిచేతా
( వేద-వాక్కుల చేతకూడా ) తెలియబడని వాడైన స్వామికి
ఏ వాక్కులతో స్తోత్రం చేయగలము ?!
ఉద్వాసనం : విశ్వమునకు లోపలా, బయటా వ్యాపించియున్నట్టి
స్వామికి ఉద్వాసనం చెప్పటం ఎలా సాధ్యం ?!
[ అయినా స్వామీ ! నీకు సకలోపచార పూజలను చేస్తూనే ఉంటాం !
" చంద్రునికో నూలుపోగు ! " అన్న చందంగా;
నీ మహిమను స్మరించటానికీ, భావించటానికీ ఒక అధారరూపంగా ! ]
********************************************