‘దేవుడు’ టాగుతో ఉన్న టపాలు

భగవంతుని పొందటం ఎలా ?

10/08/2010

భగవంతుని పొందటం ఎలా ?
(1)రబీంద్రనాధ టాగూరు అంటారు :

భగవంతుని తెలుసుకోవటానికి మూడు మార్గములున్నాయి.
1.ఙ్నాన మార్గము­_ఇది అందరికీ సాధ్యము కాదు.వేలితో లెక్కపెట్టతగినంత మందికే సాధ్యము.
2.కర్మ మార్గము_ఇది కూడా చాలా తక్కువ మందికే సాధ్యము. కోరికలు చంపుకున్న
వారే కర్మ ఫలములను పొందగలరు.
3.భక్తి మార్గము_ఇది అన్నిటికన్నా సులభము.భక్తి ,నమ్మకము,ప్రేమ భగవంతుని దగ్గరకు
చేర్చుతాయి.”

(2)సాయి బాబా అంటారు :

భగవంతుని చేరటానికి 6 మార్గాలున్నాయి.
1.మంచి సాంగత్యము
2.ఙ్నాన మార్గమును అనుసరించుట
3.ఏకాగ్ర భక్తి
4.ఎల్లప్పుడు భగవంతుని గూర్చి మాట్లాడుట
5.భక్తి ఉన్నత స్తాయికి చేరినప్పుడు నవ్వుట,ఏడ్చుట, శరీరము వశము తప్పుట
6.శరీరముతో సహా తనను తాను మర్చిపోవుట”

(3) మహాత్ములందరి ఉపదేశ సారం :

౧. గొప్ప గొప్పవాటిని పొందాలనే కోరిక, తపన సర్వమానవ సహజం.
౨. విశ్వమంతటికన్న విశ్వేశ్వరుడు గొప్ప !
౩. ఆ భగవంతుడిని పొందాలంటే -అతడు భక్తికి మాత్రమే వశ్యుడు !
౪. భక్తి యనగా భగవంతునియందు పరమ ప్రేమ.
౫. ఆ ప్రేమ అవ్యాజముగా నున్ననే భగవంతుని ఆకర్షింప గలుగుతుంది.
౬. తమ తమ స్వార్థముతో గాకుండా, ఏమీ ఆశించకుండా -
” నన్ను నన్నుగా ప్రేమించే “వారినే మనుష్యులు ఎక్కువగా ప్రేమిస్తారు కదా.
౭. దేవుడూ అంతే ! అసలు ఈ గుణం ఆయననుంచే మనకు అబ్బింది.
” భగవంతుని కొరకే భగవంతుని ప్రేమించే ” వారినే, భగవంతుడు కూడా ప్రేమిస్తాడు.
అలా కాకపోతే, అది మనవైపునుంచి జరిగే ” ఒక వైపు మాత్రమే ” ప్రేమ అవుతుంది.
అప్పుడు భగవంతుడు ప్రేమించడు కానీ, జాలి పడతాడు, దయ జూపుతాడు.
ఆ స్థితి ఏ నిజమైన ప్రేమికకైనా సహింప శక్యమా ?!
౮. పూర్వకాలంలో వలె – చదువుకున్నాకూడా ఇతర వ్యాపకాలు లేకుండా, క్రొత్తగా పెళ్ళి అయి,
కాపురానికి వెళ్ళబోయే సుగుణవతి అయిన నవ-వధువు వలె -
సర్వకాల సర్వావస్థలయందు భావనలన్నీ యోగ్యుడైన పతి ( జగత్పతి ) యందే పరిభ్రమిస్తూ ఉంటే -
ఆ మాధుర్య – ఆనంద స్థితియే భక్తికి పరాకాష్ఠ ! ఆ ( జగత్ ) పతియొక్క ప్రేమలో
కరిగిపోవటమే జీవన సాఫల్యం !
౯. భావనలో భక్తి -తాదాత్మ్యం కుదురుకున్నాక, ఏం చేసినా, ఎలా చేసినా, ఏ రూపాన్ని కొలిచినా,
ఏనామాన్ని స్మరించినా, నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని అనుసరించినా -
అంతా భగవత్-సాన్నిహిత్యమే; అంతా భగవత్-సంయోగమే; అంతా ఆనందమయమే !

భగవన్-నిర్గుణ మానస పూజా ( శ్రీ శంకరాచార్య కృతమ్ )

05/08/2010

భగవన్-నిర్గుణ మానస పూజా ( శ్రీ శంకరాచార్య కృతమ్ )

1    అఖణ్డే సచ్చిదానన్దే నిర్వికల్పైకరూపిణి |
స్థితే2ద్వితీయ-భావే2పి కథం పూజా విధీయతే ||

అఖండమూ, నిర్గుణమూ అయిన సచ్చిదానంద స్వరూపుడూ అయిన
పరమాత్మకు పూజ ఏవిధంగా చేయగలము?!

2    పూర్ణస్యావాహనం కుత్ర సర్వాధారస్య చాసనమ్ |
స్వచ్ఛస్య పాద్య మర్ఘ్యం చ శుద్ధస్యాచమనం కుతః ||

౧    ఆవాహనం :  పరిపూర్ణుడైన ( అంతటా నిండియున్న ) స్వామిని
ఎక్కడినుంచి ఎక్కడికి ఆహ్వానించగలము ?!
౨    ఆసనం :  సర్వమునకు తానే ఆధారముగా ఉంటున్న స్వామికి
ఆధారముగా ఏ ఆసనమును సమర్పించగలము ?!
౩,౪    పాద్యం, అర్ఘ్యం :  నిత్య స్వచ్ఛుడు అయిన స్వామియొక్క పాదపద్మములను,
కరకమలములను శుద్ధిచేయగల ఉదకము లున్నవా ?!
౫    ఆచమనం :  నిత్య పరిశుద్ధుడు, సర్వపావనుడు అయిన స్వామికి
ఆచమనం ఎందులకు ?!

3    నిర్మలస్య కుతః స్నానం వాసో విశ్వోదరస్య చ |
అగోత్రస్య త్వవర్ణస్య కుత స్తస్యోపవీతకమ్ ||

౬    స్నానం : మాలిన్యమే లేని నిర్మలునకు స్నానం వల్ల ప్రయోజనం ఉందా ?!
౭    వస్త్రం :    విశ్వమంతటినీ తన ఉదరంలోనే దాచుకున్న స్వామికి,
ఆయన దేహాన్ని కప్పగల వస్త్రం ఏమివ్వగలము ?!
౮    యజ్ఞోపవీతం : స్వయముగా ఏ గోత్రము, ఏ వర్ణమూ లేనట్టిన్నీ,
అన్ని గోత్రములకూ, అన్ని వర్ణములకూ మూలమైనట్టిన్నీ,
అనుపనీతుడైనట్టిన్నీ  స్వామికి
యజ్ఞోపవీతము ఏమని సమర్పించగలము ?!

4    నిర్లేపస్య కుతో గన్ధః పుష్పం నిర్వాసనస్య చ |
నిర్విశేషస్య కా భూషా కో2లఙ్కారో నిరాకృతేః ||

౯    గంథం : కర్మాకర్మలూ, పాపపుణ్యాలూ ఏవీ అంటని స్వామికి
గంథం పూయటం ఎందులకు ?!
౧౦    పుష్పం : ఏ వాసనలూ లేని, అంటని, వాసనారహితుడైన స్వామికి -
ఆత్మ-చైతన్య ప్రకాశం కలిగిన సువాసనా-యుతమైన
మనఃపుష్పాన్ని సమర్పించాలిగాని -
ప్రకృతిలోని పుష్పముల సమర్పణ ఎందులకు ?!
ఆభరణాని : ఆకాశం వలె సర్వవ్యాపకంగా ఉంటూ, అవయవములు లేనట్టి
స్వామికి ఆభరణాలు ఎక్కడ ధరింప జేయగలము ?!
అలంకారం : నిరాకారుడైన స్వామికి ఏమి అలంకారం చేయగలం ?!

5    నిరఞ్జనస్య కిం ధూపై ర్దీపైర్వా సర్వసాక్షిణః |
నిజానన్దైక-తృప్తస్య నైవేద్యం కిం భవేదిహ ||

౧౧    ధూపం : నిరంజనుడైన స్వామికి ధూపము లెందులకు ?!
౧౨    దీపం :    సర్వసాక్షియై, సర్వ దృశ్యములకూ దృక్ స్వరూపుడైనట్టి
స్వామికి దీపదర్శనము వలన ఏం ప్రయోజనం ?!
౧౩    నైవేద్యం : అఖండ – ఆత్మానందము ననుభవిస్తూ తృప్తుడైన స్వామికి
నైవేద్యముగా  ఏమి ఇవ్వగలము ?!

6    విశ్వానన్దయితు స్తస్య కిం తాంబూలం ప్రకల్పతే |
స్వయంప్రకాశ-చిద్రూపో యో2సావర్కాది-భాసకః ||

7    గీయతే శ్రుతిభి స్తస్య నీరాజనవిధిః కుతః |
ప్రదక్షిణ మనన్తస్య ప్రణామో2ద్వయ వస్తునః ||

౧౪    తాంబూలం : విశ్వాన్ని అంతటినీ ఆనందమయము చేసే స్వామికి
ఆనందకరంగా ఉండే తాంబూలం ఏమివ్వగలం ?!
౧౫    నీరాజనం : వేదములు ఎవరినైతే, ” చిద్రూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు,
సూర్య చంద్రాగ్ని గ్రహ నక్షత్రాదులను భాసింప జేస్తున్నాడు “
అని కీర్తిస్తూన్నాయో, అట్టి స్వామికి ఏమి హారతులివ్వ గలము ?!
ప్రదక్షిణం : దిక్కులు అన్నీ కూడా ఎవరిలోనే లయిస్తూన్నాయో, అట్టి
అనంతుడైన స్వామికి ప్రదక్షిణములు సాధ్యమా ?!
నమస్కారం : సర్వమూ తానేయైన వానికి, రెండవ వస్తువే లేని అద్వితీయుడైన
స్వామికి నమస్కారము చేయగలవారు ఎవరు ?!

8    వేదవాచా మవేద్యస్య కిం వా స్తోత్రం విధీయతే |
అన్తర్బహిః సంస్థితస్య ఉద్వాసనవిధిః కుతః ||

౧౬    మంత్రపుష్పం ( స్తోత్రం ) : అన్నిటినీ తెలుసుకునేవాడే గానీ, దేనిచేతా
( వేద-వాక్కుల చేతకూడా ) తెలియబడని వాడైన స్వామికి
ఏ వాక్కులతో స్తోత్రం చేయగలము ?!
ఉద్వాసనం : విశ్వమునకు లోపలా, బయటా వ్యాపించియున్నట్టి
స్వామికి ఉద్వాసనం చెప్పటం ఎలా సాధ్యం ?!

[ అయినా స్వామీ ! నీకు సకలోపచార పూజలను చేస్తూనే ఉంటాం !
" చంద్రునికో నూలుపోగు ! " అన్న చందంగా;
నీ మహిమను స్మరించటానికీ, భావించటానికీ ఒక అధారరూపంగా ! ]

********************************************

భగవద్-విభూతి ( భగవద్గీత లోనుంచి )

13/05/2010
 
 
భగవద్-విభూతి ( భగవద్గీత లోనుంచి )
 
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ ! సనాతనమ్ |
బుద్ధి ర్బుద్ధిమతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్ ||(7-10)
……
……
యద్య ద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జిత మేవ వా |
తత్తదే వావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవమ్ ||10-41)
 
శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెబుతున్నాడు: 
 
అర్జునా ! పంచ భూతాలకూ, సకల చరాచర సృష్టికీ బీజం 
వంటి మూలకారణమును నేనే అని తెలిసికొనుము.
బుద్ధిమంతులలోని బుద్ధిని నేనే; 
తేజస్వులలోని తేజస్సునూ నేనే !
బలవంతులలోని బలమునూ నేనే ! 
ప్రాణులయందున్నటువంటి – ధర్మమునకు విరుద్ధము కాని -
కామమును, కోరికను నేనే !
నదులలో గంగానది నేనే ! అక్షయమైన కాలమును నేనే !
మనుష్యులలోని కృషి చేసే గుణం నేనే ! 
విజయం అనే ఫలమూ నేనే !
మునులలో వ్యాసుడను నేనే !
 
వేయేల ?  ఎక్కడెక్కడ శ్రీమంతము, శోభస్కరము, శ్రేష్ఠము 
అయిన సత్త్వము – తత్త్వము కనుపిస్తుందో, అక్కడక్కడ 
ఉన్నది నా యొక్క తేజస్సులోని ఒక అంశ మాత్రమే 
అని గ్రహించు !
 
( భావం : పూర్వజన్మ పుణ్య ఫలంగా గానీ, ఈ జన్మలోని 
పూర్వాభ్యాస బలంవల్ల గానీ – ధర్మానికి విరుద్ధం కాని -
శ్రేష్ఠత్వాన్ని సంతరించుకున్నట్టి జడములు, చేతనములన్నిటి
లోనూ భగవద్-విభూతిని ( ఉనికిని, ప్రకాశాన్ని ) గుర్తించటం, 
ప్రత్యక్ష దైవంగా ఆరాధించటం మన భారతీయ సంస్కృతి లోని 
గొప్పదనం, విశిష్టత ! 
ఇది అనితర చింత్యం; అనితర బోధ్యం; అనితర సాధ్యం ! )
 

భగవద్గీత లో – ” భగవత్తత్త్వం ” గురించి.

19/02/2010
   
  భగవద్గీతలో ” భగవత్తత్త్వం ” గురించి.
   
  కృష్ణం వన్దే జగద్గురుమ్.
   
  పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు, శిష్యోత్తముడైన అర్జునునికి,
  నిజతత్త్వమును ఉపదేశించుచూ పలికిన పలుకులు: 
  జగద్గురు వేదవ్యాస మహర్షి కృపవలన మనకు అందినవి:
   
  శ్రీ భగవానువాచ :
   
శ్లో|| ( 9 – 18 )
   
  గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |
   
  ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ ||
   
   
   
ప్రభవః =
  ఈ జగత్తు యొక్క సృష్టికి అనగా అవ్యక్తం నుండి వ్యక్తం అగుటకు,
స్థానం =
  స్థితికి అనగా వ్యక్తరూపములో నుండుటకు,
ప్రళయః =
  లయమునకు అనగా వ్యక్తం నుండి మరలా అవ్యక్తంలో 
  చేరిపోవుటకు,  మూలకారణం నేనే !
అవ్యయం =
  ఈ సృష్టి – స్థితి – లయములనేవి నిరంతర చక్రభ్రమణంలో నుండుట 
  వలన, ఈ మూడూ వ్యయమయ్యేవే. 
  వ్యయము, తరుగుదల, నాశనము లేనట్టి, అందుచే శాశ్వతమైనట్టి
బీజం =
  విత్తనం అనగా మూలకారణం నేనే !
నివాసః =
  నేను ఈ జగత్తుకు నివాస స్థానమును. అనగా ఈ చరాచర 
  జగత్తు అంతా – కాలతః, దేశతః అనంత వ్యాపకత్వం గల - 
  నాయందే ఉంటున్నది. ఎలా అయితే సకల పదార్థాములూ
   ఆకాశంలోనే ఉంటూన్నాయో, అలాగే ! 
సాక్షీ  =
  అందువలననే, భావాభావములకు, కృతాకృతములకు నేనే సర్వసాక్షిని! 
  చేసిన కర్మలకు, చేయక విడచిన కర్మలకుకూడ చిత్ర,గుప్త సాక్షిని నేనే! 
  చేయకూడనివి చేసినా, చేయవలసినవి మానినా  కూడ
  ఆయా కర్మాకర్మల ఫలప్రదాతను నేనే !
నిధానం =
  సంబారములుంచు చోటు, అనగా సకల ప్రాణులు భవిష్యత్తులో 
  అనుభవించుటకు వలయు సామగ్రి  నిలువ యుండు చోటును నేనే ! 
గతి: =
  కర్మలయొక్క ఫలమును నేనే ! అందరికీ, అన్నిటికీ గమ్యము, 
  గమనము, గతి, దిక్కు నేనే ! సంకోచ వ్యాకోచములు నేనే !
  నానుండి బయటకు వచ్చిన జగత్తు, మరలా నాలోనికే 
  ప్రయాణిస్తోంది – హృదయ స్పందన వలె ;
  స్థితిస్థాపక శక్తి ( ఎలాస్టిసిటీ )గల దారమునకు కట్టి విసిరిన బంతి వలె! 
  ఈ విభిన్న సాధనలూ, సంప్రదాయాలన్నీ కూడా. ఈ ప్రయాణం 
  ఆనందకరంగా, ఆటుపోట్లు లేకుండా, శీఘ్రంగా గమ్యం చేరుకోవడానికే! 
  అఖండ శాశ్వత ఆనంద స్థితిని పొందడానికే !
  గమ్యం శ్రీశైల పర్వత శిఖరం అయితే, సాధకులందరూ 
  ఒకే గమ్యాన్ని చేరుకునేందుకై,  వివిధ మార్గాలలో, వివిధ స్థాయిలలో 
  ప్రయాణిస్తూ ఉన్నవారు. ఈవేళ వీరున్న చోటికి రేపు వారు రావచ్చు!
  చిత్రం ఏమంటే, ” చుట్టుప్రక్కల ఉన్న వింతలూ, వినోదాలూ 
  అన్నీ చూసుకుంటూ నిదానంగావెళ్ళవచ్చులే “  
  అనుకునేవారు కొందరు ;” గమ్యం అంత సులభంగా అందేది కాదు, 
  ఎందుకొచ్చిన శ్రమ ! ” అనుకుంటూ తిరోగమించేవారు మరికొందరు !
  గురుస్థాన యోగ్యత ఇంకా రాకపోయినా, ఉన్నత కక్ష్య లోని విద్యార్థులు
  క్రింది కక్ష్య లోనివారికి మార్గదర్శనం చేస్తూ, సాధక – బాధకాలను 
  వివరిస్తూ సరియైన మార్గంలో ముందుకు సాగేందుకు తోడ్పడడంలో
  తప్పు లేదు. అలాగే, సాధకులు కూడ, తమకు అందిన సూచనలు
   శాస్త్రీయమైనవా కావా, తమస్థాయికి అనుకూలమా కావా
  అనే ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం ఈ రోజులలో అత్యవసరం. 
  దీనికోసం, అవకాశం ఉన్నప్పుడల్లా ప్రామాణిక ( వ్యాసాది ప్రోక్త )
   గ్రంథ శ్రవణం, పఠనం, మననం చాలా సహాయకరం !
భర్తా  =
  పోషించువాడను, రక్షించువాడను, భరించువాడను నేనే !  వారి వారి 
  అభ్యుదయ నిఃశ్రేయసముల కొరకై – అనునయించువాడను, 
  ప్రచోదన చేయువాడను, నిర్ణయించువాడను నేనే !
ప్రభుః =
  స్వామిని, ప్రభువును, శాసించువాడను నేనే ! అవసరమైనచో 
  పరివర్తనము తెచ్చుటకై  న్యాయబద్ధముగా శిక్షించువాడను కూడ నేనే!
సుహృత్ =
  అందరికీ, ఎవరికి వారికే నిజమైన మిత్రుడను నేనే ! 
  ప్రత్యుపకారాపేక్ష లేకనే, అవ్యాజమైన ప్రేమతో, అడగకనే హితము,
   ఉపకారము చేయువారే  నిజమైన మిత్రులు; 
  ” సుహృత్ ” శబ్ద వాచ్యులు. పరస్పరం భోజనభాజనాదులు, 
  నిష్కారణ సందర్శనములు, మానసిక భావ విచార వినిమయములు, 
  రహస్య గోపనం లేకుండుటలు, సమస్యా పరిష్కార ప్రయత్నములు, 
  మున్నగున.వి   మిత్ర లక్షణములు !
  మిత్ర సమాగమం ఉన్నప్పుడే కదా మిత్రులవల్ల ప్రయోజనం కలిగేది !
శరణం =
  ఆర్తితో ప్రార్థించు భక్తుల ఆర్తిని హరించువాడను, శరణ్యుడను నేనే !
   
  *******************************************
   

Follow

Get every new post delivered to your Inbox.