‘పండుగలు – పర్వాలు’ అనే వర్గంలోని టపాలు

తీర్థయాత్రలు: (అత్యధిక ప్రయోజనం పొందటం ఎలా?)

28/06/2010
 
తీర్థయాత్రలు: (అత్యధిక ప్రయోజనం పొందటం ఎలా?)
 
 
సామాజిక రంగంలో ఉద్యోగమేళాలు, ఋణమేళాలు, 
ఆరోగ్యమేళాలు, మొ. ఎన్నో రకాల మేళాలు (Fairs) సందడిగా
నిర్వహించ బడుతుంటాయి గదా. 
 
వాటివల్ల వ్యక్తిగతంగా లబ్ధి పొందినప్పుడే గదా 
వాటిలో పాల్గొనటం వల్ల ప్రయోజనం ! లేకపోతే 
మనం చూసే అనేక తమాషాలలో అవీ కొన్ని అవుతాయి.
 
ఆ మేళాకు వెళ్ళిరావటం వలన, మనకు ఉద్యోగమో, ఋణమో
రాకపోయినప్పటికీ, కనీసం ఏయే అర్హతలు, ఏయే పత్రాలు
సిద్ధం చేసుకుంటే, భవిష్యత్తులోనైనా మనకు వాటిని పొందే 
అవకాశం పెరుగుతుందో తెలియవస్తుంది. కనీసం ఆ ప్రయోజనం 
దక్కించుకున్నా కూడా, వారు వివేకుల క్రిందే లెక్క !
 
ఆ మేళాల ( Fairs ) లో పాల్గొనకుండా కూడా, అంతకంటే
ఎక్కువ ( ఆరోగ్యాది ) లాభాలను పొందవచ్చు 
 
ఆధ్యాత్మిక రంగంలో – కుంభమేళాలు, తిరునాళ్ళు, 
తీర్థయాత్రలు మొ. కూడా అంతే గదా ! 
 
వాటివల్ల వ్యక్తిగతంగా మనం (ఆధ్యాత్మిక) లబ్ధి పొందితేనే గదా
వాటిలో పాల్గొనటంవల్ల ప్రయోజనం ! లేకపోతే, ఆయా 
నదులలో ఈదే చేపలకన్న, ఆయా క్షేత్రాలలో ఎగిరే పక్షులకంటే 
ఏ విధంగా మనం ఉన్నతులం? వ్యయ ప్రయాసలకోర్చ
అందిపుచ్చుకున్న సువర్ణావకాశాన్ని జారవిడుచుకున్న
అవివేకులం కాదా?
 
ఆ తిరునాళ్ళు మొ. వాటిలో పాల్గొనకుండా కూడా
అంతకంటే ఎక్కువ ఆధ్యాత్మిక ఉన్నతి సాధించే వీలు
ఉన్నది గదా !
 
కాబట్టి చెప్పవచ్చినదేమంటే – తీర్థయాత్రలు, మొ. మానమని
కాదు; మన ఇష్ట దైవానికి సంబంధించిన ఏదైనా ఒకటో రెండో
సిద్ధక్షేత్రాలను అప్పుడప్పుడు దర్శించి, ఆ దైవంతో అనుసంధానం
పెంచుకోవటం కోసమే చెయ్యాలి. మహా పురుషుల చరిత్రలను
పరిశీలిస్తే, ఒక్కొక్కరు ఒక్కొక్క దైవానికి, ఒక్కొక్క క్షేత్రానికి 
అంకితమయ్యారని, అలా అవటం వల్లనే ప్రసిద్ధి, సిద్ధి పొందారనీ 
అనిపిస్తుంది. 
 
మోక్షసాధన వరకు ఉపయోగపడగలది యోగం. కాని, ఆధునిక 
పద్ధతులలో యోగా చేయటం ద్వారా, మనకి 
just breathing – exercises యొక్క ఫలం మాత్రమే
దక్కుతోంది !
 
అలాగే, మోక్షసాధన వరకు ఉపయోగపడగల ” తీర్థాటనము”ను
ఆధునిక పద్ధతులలో చేయటం వలన, just Tourism యొక్క
ఫలం మాత్రమే వచ్చే దక్కుతోంది గదా !
 
భౌతికంగా పెరిగిన ప్రయాణాది సౌకర్యాలను వాడుకోవద్దని కాదు;
మన మానసిక శక్తులను – వింతలు, విశేషాలు, మొ. అనవసర
విషయ బాహుళ్యం మీదికి చేదిరిపోనీయకుండా -
భగవంతునితో మానసిక అనుబంధాన్ని దృఢపరచుకునే
దృక్పథంతోనే తీర్థయాత్రలను చేస్తే, ఎంత అద్భుత ఫలితం !
 
పల్లెటూళ్ళో ఉన్న తాతగారు, బామ్మలు – తమను చూడటానికి 
ఏ అమెరికానుంచో వచ్చిన మనుమలూ, మనుమరాళ్ళూ -
తమకోసం తెచ్చినవి చూసి మాత్రమే సంతోషిస్తారా?
వారికి తమపట్ల ఉన్న అభిమానం, ఆత్మీయత, శ్రద్ధాభక్తులు,
మొ. వాటిని చూసి, అంతకన్న ఎక్కువ సంతోషించరా ?
భౌతిక విషయ ప్రపంచంలో వారు ఎంత పైకెదిగినా,
తాము చూపిన సంప్రదాయ మార్గాన్ని వదిలిపెట్ట లేదుకదా?
విలువలకు కట్టుబడి ఉంటున్నారు కదా? మొ. విషయాలు
వారికి అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయా, ఇవ్వవా?
 
అవియే భగవంతుడు మననుంచి కోరుకునేది !
 

శ్రీ రామ నవమి ప్రార్థన

24/03/2010

శ్రీరామ. ౨౪ – ౦౩ – ౨౦౧౦ (24 – 03 – 2010 )

మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు !

శ్లో || రామో రాజమణి ర్విరాజతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూః రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాత్పరతరం రామస్య దాసో2స్మ్యహం
రామే చిత్తలయం సదా భవతు మే భో ! రామ ! మాముద్ధర ||

श्लो ॥ रामो राजमणि र्विराजते रामं रमेशं भजे
रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः ।
रामान्नास्ति परात्परतरं रामस्य दासो2स्म्यहं
रामे चित्तलयं सदा भवतु मे भो ! राम ! मामुद्धर ॥

rAmo rAjamaNi rvirAjate rAmaM rameSaM Baje
rAmeNABihatA niSAcaracamUH rAmAya tasmai namaH |
rAmAnnAsti parAtparataraM rAmasya dAso2smyahaM
rAme cittalayaM sadA Bavatu me Bo ! rAma ! mAmuddhara ||

సంస్కృతభాషలో ప్రప్రథమంగా నేర్పబడే “రామ’శబ్దం లోని ఎనిమిది
విభక్తుల ఏకవచన రూపాలన్నీ పై శ్లోకంలో అందంగా కూర్చబడ్డాయి.
రామః – రామం – రామేణ – రామాయ – రామాత్ – రామస్య -
రామే – హే రామ ! – అనేవి ఆ ఎనిమిదిన్నూ.

“”"రామునియందే నా చిత్తము ఎల్లప్పుడు లయించియుండు గాక !

ఓ రామా ! నన్ను ఉద్ధరింపుము ! ’
అనే భావం కలిగిన ( పై శ్లోకములోని ) ఒక్క నాల్గవ పాదమైనా
మనకు వాచోవిధేయమై, ఎల్లప్పుడు నాలుకమీద ఆడుతూ,
మనస్సును స్పృశిస్తూ ఉంటే, అతి గొప్ప ప్రార్థనలలో ఇది కూడా
ఒకటి అవటంలో సందేహం లేదు !

హనుమల్లక్ష్మణ భరతశతృఘ్న పరివారసమేతులైన
ఆ సీతారాముల పరిపూర్ణానుగ్రహం మనందరిపై వర్షించుచుండు గాక !

శ్రీ ” వికృతి ” నామ సం. ఉగాదికి సుకృత సంకల్పాలు

15/03/2010

తెలుగు బంధువులారా !

ఉగాది ( ౧౬-౦౩-౨౦౧౦ ) తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు !

ఈ శుభ సందర్భంలో ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ముఖ్యంగా తన పరిపూర్ణానుగ్రహాన్ని ఈ సంవత్సరమంతా వర్షించాలని ప్రార్థిస్తూన్నాను.

మన వంతు ప్రయత్నంగా, కొన్ని దృఢ నిర్ణయాలు చేసుకుందాము.

(౧) నిత్యమూ భగవంతుని భక్తిభావ కుసుమాలతో పూజిద్దాం.

(౨) రోజుకు ఒక సారైనా, ఆయన అనుగ్రహం తప్ప ఏమీ కోరని ప్రార్థన చేద్దాం.

(౩) రోజూ ” నేను భారతీయుడిని / భారతీయురాలిని “ ,అనీ, ” నాది తెలుగు కుటుంబం ” అనీ స్మరించుకుందాం.

(౪) భారతీయ సంస్కృతికి అనుగుణంగా, రోజూ ఒక్క భగవద్గీతా శ్లోకాన్ని అర్థంతో సహా పారాయణ చేద్దాం.

(౫) ” లోకాః సమస్తాః సుఖినో భవన్తు ” అనిరోజుకొక సారి ఆకాంక్శిద్దాం.

(౬) తెలుగుదనానికి ప్రతీకగా రోజూ ఏదో ఒక్క తెలుగు పద్యాన్ని పైకి చదివి, మన కుటుంబ సభ్యులకు వినబడేలా చేద్దాం.

(౭) తెలుగు లిపిలోనున్న ఏదో ఒక విషయం – పత్రికో, పుస్తకమో, బ్లాగో – ఏదో ఒకటి రెండు నిమిషాల పాటు అయినా చదవటం, చదివించటం అలవాటు చేసుకుందాం.

(౮) పై విషయాలను మన దినచర్యలో భాగం చేసుకుంటే, మనం భారతీయులమని, తెలుగువారమని గుండెలమీద చేయి వేసుకుని సగర్వంగా చెప్పగలం !

(౯) రోజూ చేయటానికి వీలుపడనంత వేగవంత జీవితం గడిపేవారు మాత్రం కనీసం వారానికోసారి పాటించినా చాలు. పై విషయాలను స్పృశించకుండా, ఏ వారమూ ( week – end ) కూడా గడిచి పోకూడదు !

శ్లో || ” ప్రకృతిః పఞ్చభూతాని గ్రహాలొకాః స్వరాస్తథా |

        దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వన్తు మఙ్గళమ్ ||

భవదీయుడు,

భాగవతుల శ్రీనివాస రావు

(kamthasthabharathi.wordpress.com)

NOTE: Please click at the Title ” TELUGU BHAKTI ” at the top of this Post, to get a view of the side-bar. Then you can click on any page / subject you like.


Follow

Get every new post delivered to your Inbox.